మంత్రి పీఏ లైంగిక వేధింపుల కేసు: ఏపీలో వీడియో వైరల్, సంచలనం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మహిళా భద్రత అంశం హాట్ టాపిక్ అయ్యింది. అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణికి సంబంధించిన పీఏ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

మంత్రి పీఏ (పర్సనల్ అసిస్టెంట్) సతీష్, అతని కుమారుడు పృథ్వీపై ఓ మహిళ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఉద్యోగం ఎర.. 5 లక్షల దందా!

వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదు చేసిన మహిళ భర్త 2021లో కరోనాతో మరణించారు. దీంతో ఆమె కారుణ్య నియామకం (Compassionate Grounds) కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని, ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా భావించిన పీఏ సతీష్, ఆమెకు దగ్గరయ్యాడు. ‘ఉద్యోగం పక్కాగా ఇప్పిస్తా, అధికారులకు లంచం ఇవ్వాలి’ అంటూ నమ్మబలికి ఏకంగా రూ. 5 లక్షలకు పైగా డబ్బులు ఆమె వద్ద నుంచి వసూలు చేశాడు.

అయితే, సతీష్ మాట నిలబెట్టుకోలేదు. ఉద్యోగం సంగతి అటుంచితే, తాను ఇచ్చిన డబ్బులు ఉన్నతాధికారులకు చేరలేదని, సతీషే కాజేశాడని ఆమెకు తెలిసింది. దీంతో ఆ మహిళ ధైర్యం చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీసింది. అప్పటి నుంచి ఆ పీఏ అసలు రూపం బయటపడింది. ఉద్యోగం మాట పక్కన పెట్టి.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు.

మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత, పీఏ సతీష్‌ పవర్ మరింత పెరిగిందని, అతని వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్లీల పదజాలంతో దూషించడమే కాకుండా, అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేసింది. సతీష్‌తో పాటు అతని కుమారుడు పృథ్వీ కూడా ఫోన్లు చేసి వేధించేవారని.. ‘ఒక గంట వచ్చి వెళ్లిపో’ అంటూ నీచమైన డిమాండ్లు చేసేవారని ఆమె ఆరోపణలు చేసింది.

నవంబర్ 24న సతీష్ తన పుట్టినరోజు సందర్భంగా మద్యం మత్తులో తన ఇంటికి వచ్చి బలవంతం చేయబోయాడని, తన ప్రతిఘటనతో వెనుదిరిగాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వేధింపులపై బాధితురాలు నేరుగా మంత్రి సంధ్యారాణిని కలిసినా ఫలితం లేకపోయింది. మంత్రి కూడా అందరి ముందు తననే తిట్టారని, ఆ తర్వాత పేరుకు మాత్రమే సతీష్‌ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారని మహిళ వాపోయింది.

ప్రభుత్వం సీరియస్.. పీఏ సస్పెన్షన్!

స్థానిక పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో బాధితురాలు నవంబర్ 27న పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ వెంటనే స్పందించి కేసును సాలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్‌కు బదిలీ చేశారు. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడం ఊరట కలిగించింది.

మరోవైపు, ఈ తీవ్ర ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సతీష్‌ను తక్షణమే విధుల్లోంచి తొలగించి, పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఉండి, కీలక బాధ్యతలు చూస్తున్న పీఏపై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ‘మహిళా సంక్షేమం చూసే మంత్రి పీఏనే ఇలా చేస్తే, ఇక సామాన్య మహిళలకు న్యాయం దక్కేదెలా?’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు, విచారణ తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a comment