CRICKET: పరువు నిలపాలి: వన్డే సిరీస్ లో “RO-KO” పైనే భారం.!

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఎదురైన 0-2 పరాజయాన్ని మర్చిపోయి, టీమిండియా వైట్-బాల్ క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించింది. ఈ పర్యటనలో నవంబర్ 30, ఆదివారం రాంచీ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ భారత్‌కు చాలా కీలకం.

ఎందుకంటే, ఓటములను పక్కనపెట్టి కొత్త ఉత్సాహంతో ఆటను మొదలు పెట్టాలి. ఈ సమయంలోనే టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌కు సీనియర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రావడం ఒక గొప్ప సానుకూల అంశం.

రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమవడంతో, రోహిత్‌కు జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్సీ భారం కేఎల్ రాహుల్ భుజాలపై ఉంది. జట్టులో యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రిషబ్ పంత్ వంటి వారు ఉండడంతో, రో-కోలు దూకుడుగా ఆడటంతో పాటు మిడిల్ ఆర్డర్‌కు ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ సారథ్యం, రోహిత్-కోహ్లీ అనుభవం కలిసి రాహుల్ సేనకు విజయాన్ని అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సిరీస్ రోహిత్ శర్మ కు మరియు విరాట్ కోహ్లీ కు కేవలం ఒక సాధారణ మ్యాచ్ కాదు. ఇది వారి కెరీర్‌లో ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి అవకాశం.

రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 98 పరుగులు మాత్రమే దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ ఆటగాడు అవుతాడు.

అలాగే, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన షాహిద్ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్‌కు కేవలం మూడు సిక్సర్లు చాలు. ఇటీవలే ఆస్ట్రేలియాపై సెంచరీతో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్, నేటి మ్యాచ్‌లో చెలరేగిపోతే ఈ రికార్డులు కచ్చితంగా బద్దలవుతాయి.

మరోవైపు, కింగ్ కోహ్లీకి దక్షిణ ఆఫ్రికాపై అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లో కోహ్లీ సగటు 65.39 కాగా, సౌత్ ఆఫ్రికాపై ఇప్పటికే 1504 పరుగులు చేశాడు. భారత-దక్షిణాఫ్రికా ODIలలో సచిన్ (2001), జాక్వెస్ కలిస్ (1535) మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు. నేడు కొహ్లీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే, ఈ జాబితాలో కలిస్‌ను అధిగమించడం ఖాయం. ముఖ్యంగా, రాంచీ మైదానం కోహ్లీకి బాగా అచ్చొచ్చింది. ఇక్కడ నాలుగు ఇన్నింగ్స్‌లలో 192 సగటుతో 384 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

మొదటి రెండు ఆస్ట్రేలియా వన్డేలలో డకౌట్స్ తర్వాత, మూడవ ODIలో అద్భుతమైన 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. ఇప్పుడు ఫ్రెష్ ఎనర్జీతో, తన ఫేవరెట్ టీమ్‌పై బ్యాట్ ఝుళిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

రాంచీ పిచ్ సాధారణంగా పేసర్లకు, ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపవచ్చు. సౌత్ ఆఫ్రికా జట్టులో మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ వంటి ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు.

రోహిత్, కోహ్లీలు ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టుకు భారీ స్కోరు అందించాలి. ఈ ఇద్దరు సీనియర్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తే, టీమిండియా టెస్ట్ ఓటమి బాధను మర్చిపోయి వన్డే సిరీస్‌ను ఘనంగా మొదలుపెట్టడం ఖాయం.

Leave a comment