ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ ఫైర్ పుట్టించింది. కోనసీమలో పర్యటించిన జనసేనాని, కొబ్బరి తోటలు ఎండిపోతున్న వైనం చూసి.. “మన కోనసీమ అందాన్ని చూసి తెలంగాణ జనాలు దిష్టి పెట్టారేమో” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
రైతులను ఉద్దేశించి, సాధారణంగా చేసే ‘దిష్టి’ ప్రస్తావన అది. కానీ, రాజకీయ నేతల చెవులకు అది ‘సంచలన’ వార్తగా వినిపించింది.పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ముఖ్యంగా, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన కేవలం మంత్రిగా కాకుండా, సినీ పరిశ్రమ మంత్రిగా నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
“పవన్ కళ్యాణ్ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే, ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం. ఒకవేళ క్షమాపణ చెబితే, రెండు మూడు రోజులు ఆడవచ్చు. లేదంటే, విడుదల కూడా ఉండదు” అంటూ కఠినమైన హెచ్చరిక చేశారు.ఒక రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినిమాలను నిషేధిస్తామని హెచ్చరించడం టాలీవుడ్లో కలకలం రేపింది.
రాజకీయ విభేదాల కోసం సినిమా పరిశ్రమను బలి చేయడమేంటి? అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ తరుణంలోనే, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.
వివాదం ముదురుతున్న సమయంలో జనసేన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ఇది నీచ రాజకీయమని ఖండించింది.
“రైతులతో సరదాగా మాట్లాడిన మాటలను రాజకీయం చేసి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సఖ్యతను చెడగొట్టవద్దు” అని కాంగ్రెస్ నేతలకు హితవు పలికింది. కేవలం కొంతమంది తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను, యావత్ తెలంగాణ ప్రజలకు ఆపాదించడం సరికాదని జనసేన వివరణ ఇచ్చింది.
అయితే, తెలంగాణ మంత్రులు మాత్రం దీనిని వదిలిపెట్టేలా లేరు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వంటివారు ఘాటుగా స్పందించారు. “తెలంగాణపై దిష్టి ఉంటే, హైదరాబాద్లోనే ఎందుకు ఉంటున్నారు? హైదరాబాద్లోని ఆస్తులు అమ్ముకుని ఆంధ్రకు పోవాలి” అని అనిరుధ్ రెడ్డి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.
దీనిపై జనసేన శ్రేణులు, “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి, దృష్టి మరల్చడానికి ఇలాంటి ‘చీప్ ట్రిక్స్’ ప్లే చేయడం కాంగ్రెస్ పాత విద్యే” అని విమర్శించాయి. మొత్తానికి, పవన్ ఒక చిన్న మాట, కోనసీమ నుంచి మొదలై… ఇప్పుడు తెలంగాణలో సినిమా నిషేధం వరకు దారితీసింది. రాజకీయాలు-సినిమా అంచుల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్ ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాలి.

