దైవాన్ని వెక్కిరించి.. సినిమా విడుదలకు ముందు రణ్‌వీర్‌ సింగ్ క్షమాపణ!

బాలీవుడ్‌లో ఎంత హంగామా చేసినా, అప్పుడప్పుడు రణ్‌వీర్ సింగ్ ఇలాంటి చిక్కుల్లో పడడం మామూలే. ముఖ్యంగా దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు ఈయన నోరు జారుతూనే ఉంటారు.

తాజాగా, కన్నడ సినీ సంచలనం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలోని దైవారాధన సన్నివేశాలను అపహాస్యం చేసి రణ్‌వీర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) ముగింపు వేడుక రణ్‌వీర్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఈ వేదికపై రిషబ్ శెట్టిని పొగుడుతూ మాట్లాడిన రణ్‌వీర్, తన అతి ఉత్సాహాన్ని చూపించారు.

‘కాంతార’ చిత్రంలో రిషబ్ పోషించిన చాముండి దైవం పాత్రకు సంబంధించిన అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని వేదికపై అనుకరించారు. కళ్ళు తిప్పి, నాలుక బయటపెట్టి, పెద్దగా కేక వేస్తూ.. ఆ సీన్‌ను కామెడీగా చేసి చూపించారు.

అంతేకాదు, దైవాన్ని ఉద్దేశిస్తూ… అది ‘ఫిమేల్ ఘోస్ట్’ అని వ్యాఖ్యానించారు. తుళునాడు సంస్కృతిలో అత్యంత పవిత్రంగా కొలిచే చాముండి దైవాన్ని ‘దెయ్యం’ అని పిలవడం, దాన్ని షూస్ వేసుకుని స్టేజ్‌పై అపహాస్యం చేయడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. రణ్‌వీర్ ఆ హావభావాలను ప్రదర్శిస్తున్నప్పుడు పక్కనే ఉన్న రిషబ్ శెట్టి నవ్వుతున్నా, నెటిజన్లు మాత్రం మండిపడ్డారు.

మరింత షాకింగ్ విషయమేమిటంటే, రిషబ్ శెట్టి ముందే రణ్‌వీర్ ఈ పని చేశారని కొన్ని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్టేజ్ ఎక్కే ముందు రణ్‌వీర్ ఇలా అనుకరించే ప్రయత్నం చేయగా, రిషబ్ శెట్టి సున్నితంగా దైవారాధన గురించి వివరించి, మళ్లీ అలాంటి ప్రయత్నం చేయవద్దని కోరారట. అయినప్పటికీ, రణ్‌వీర్ దానిని పట్టించుకోకుండా స్టేజ్‌పై కూడా అదే పని చేయడంతో విమర్శలు పతాక స్థాయికి చేరాయి. రిషబ్ అభ్యర్థనను కూడా లెక్క చేయకుండా, పవిత్రమైన నమ్మకాన్ని హేళన చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రణ్‌వీర్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కొందరైతే ఆయన నటనను ‘బ్లాస్ఫెమీ’ (దైవ దూషణ) అంటూ దుయ్యబట్టారు. త్వరలో, అంటే డిసెంబర్ 5న, రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధూరంధర్’ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని, బాయ్‌కాట్ చేస్తామని నెటిజన్లు హెచ్చరించారు. వివాదం తీవ్రం కావడంతో, హిందూ జనజాగృతి సమితి (HJS) గోవా పోలీసులకు రణ్‌వీర్‌పై హిందూ మత మనోభావాలను దెబ్బతీశారంటూ అధికారిక ఫిర్యాదు కూడా చేసింది.

ఒకవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడం, మరోవైపు పోలీసు కేసు, బాయ్‌కాట్ ట్రెండ్ పెరగడంతో రణ్‌వీర్ సింగ్ దిగిరాక తప్పలేదు. దీంతో వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బహిరంగ క్షమాపణ లేఖను విడుదల చేశారు.

“నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. రిషబ్ శెట్టి నటన ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికే నేను అలా ప్రయత్నించాను. మా దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే, దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు” అని రాసుకొచ్చారు.

Leave a comment