బాలయ్య ‘అఖండ 2’పై తెలంగాణ సర్కార్ సంచలన జీవో.. స్పెషల్ షో రేటు రూ.600!

నందమూరి బాలకృష్ణ మాస్ పవర్ ఎంత ఉందో ‘అఖండ’ సినిమాతో యావత్ దేశం చూసింది. ఇప్పుడు ఆయన, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న ‘అఖండ 2’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ సందడి మొదలయ్యింది. ముఖ్యంగా, నైజాం (తెలంగాణ) ప్రాంతంలో టికెట్ రేట్ల పెంపుపై ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన జీవో (GO)ను తాజాగా విడుదల చేసింది. బాలయ్య అభిమానులకు ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి!

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో ద్వారా ‘అఖండ 2’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పెరిగిన ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

సింగిల్ స్క్రీన్స్: ఇంక్లూడింగ్ జీఎస్‌టీ టికెట్‌పై రూ. 50 వరకు పెంచుకునే వెసులుబాటు దక్కింది.

మల్టీప్లెక్స్‌లు: మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై ఏకంగా రూ. 100 వరకు పెంచుకోవచ్చు.

అయితే, ఈ రేట్ల పెంపు శాశ్వతం కాదు. కేవలం సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు మాత్రమే ఈ పెరిగిన ధరలకు టికెట్లు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే, డిసెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ రేట్లు అమలులో ఉంటాయి.

ఇక, ఈ జీవోలో బాలయ్య అభిమానులను మరింత ఖుషీ చేసే అంశం మరొకటి ఉంది. అదే స్పెషల్ షో పర్మిషన్. సాధారణంగా మొదటి రోజు ఉదయం షో నుంచే అసలైన సందడి మొదలవుతుంది. కానీ ‘అఖండ 2’కు మాత్రం ఒక రోజు ముందే.. అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకే ఒక ప్రత్యేక ప్రీమియర్ షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే, ఈ స్పెషల్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 600గా నిర్ణయించారు. మాస్ సినిమాలకు ఈ మాత్రం ప్రీమియం ఉండాల్సిందే కదా! రూ. 600 అయినా బాలయ్య ఫ్యాన్స్ ఏమాత్రం వెనకాడకుండా టికెట్లు కొని, తమ అభిమాన హీరో విశ్వరూపాన్ని ముందుగానే చూసేందుకు సిద్ధమవుతారు. ఈ రేటు చూసి సాధారణ ప్రేక్షకులు కాస్త ఆశ్చర్యపోయినా, ఫ్యాన్స్‌కు ఇది లెక్కలోకి రాదు.

ఈ ధరల పెంపుతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన, సామాజిక దృక్పథం ఉన్న కొత్త నిబంధనను కూడా జోడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినీ పరిశ్రమ సంక్షేమం గురించి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల రేట్ల పెంపు ద్వారా వచ్చిన అదనపు లాభంలో 20 శాతం మొత్తాన్ని మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (MAA) తో పాటు ఇతర సినీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నిజానికి, ఇది చాలా ప్రశంసించదగిన నిర్ణయం. భారీ రేట్లతో టికెట్లు కొనే ప్రేక్షకుడి డబ్బు.. కొంత మేరకైనా కష్టపడే సినీ కార్మికులకు ఉపయోగపడుతుంది. ఈ నిధుల నిర్వహణ కూడా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ద్వారా ఒక ప్రత్యేక అకౌంట్‌ను ఓపెన్ చేసి, దానిని లేబర్ కమిషనర్ సూచనల మేరకు పకడ్బందీగా మెయింటైన్ చేయాలని జీవోలో ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి, ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది.

Leave a comment