పాన్-ఇండియా చిత్రం అంటే మాటలు కాదు! దానికి తగ్గ కథ, స్టార్ కాస్ట్, యాక్షన్, ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి. ఈ విషయంలో ఇప్పుడు అందరి దృష్టి యువ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ సినిమాపై పడింది. ‘డెవిల్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అభిషేక్ నామా ఈ ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు.
బడ్జెట్ అదుర్స్: నిర్మాతల సాహసం!
ఈ సినిమాను ఎంత భారీగా ప్లాన్ చేశారంటే, దాని కోసం పెడుతున్న ఖర్చు చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. కిషోర్ అన్నపురెడ్డి మరియు నిశిత నాగి రెడ్డి (NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఖర్చు విషయంలో ఏమాత్రం పరిమితులు పెట్టడం లేదట. కథకు తగ్గట్టుగా అద్భుతమైన యాక్షన్ సీన్లు, హై-ఎండ్ VFX కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గుప్త నిధుల నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం తరహాలో వేసిన ఒక సెట్‌కే సుమారు ₹10 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో అక్కడ ఒక భక్తి గీతాన్ని కూడా చిత్రీకరించారు.
క్లైమాక్స్ కోసం రికార్డు సెట్..!
తాజా అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ఆ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ లో ఏకంగా ₹20 కోట్ల వ్యయంతో ఒక భారీ సెట్‌ను నిర్మించారు.
కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే ఇంత పెద్ద సెట్ వేయడం అంటే, ఈ సినిమా స్కేల్ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ డిజైన్ చేసిన ఈ సెట్స్ గ్రాండియర్‌ను చూసి మీడియా మిత్రులు, సినీ ప్రముఖులు అవాక్కయ్యారంటే అతిశయోక్తి కాదు.
‘నాగబంధం’ కథాంశం భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా, పద్మనాభస్వామి మరియు పూరి జగన్నాథ్ ఆలయాలలో కనుగొనబడిన నిధులు, నిక్షేపాల మిస్టరీల స్ఫూర్తితో దర్శకుడు అభిషేక్ నామా ఒక ఆధ్యాత్మిక, సాహసోపేతమైన కథను అద్భుతంగా రాసుకున్నారు.
ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన నభా నటేష్ మరియు ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘నాగబంధం’ తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైతే, నిర్మాణంలో చూపిన భారీతనం విజయవంతం రూపంలో మరింత భారీగా మారుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

