రాబోయే పార్లమెంటరీ సమావేశాలు ఓ పెద్ద రాజకీయ యుద్ధానికి వేదిక కానున్నాయి. ప్రతిపక్షం ఈసారి కేవలం గొడవ చేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మాత్రమే కాకుండా..దేశానికి కీలకమైన “హెచ్చరిక సంకేతాలు” ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, మీడియా రెండూ పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈసారి వారు ఎంచుకున్న అంశాలు చిన్నవి కావు… ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చేంత శక్తిమంతమైనవి!
కార్మిక చట్టాలపై గురి: సామాన్యుల జీతాలకే చిక్కు.!
ప్రతిపక్షం గురిపెట్టిన మొదటి అంశం- కొత్త కార్మిక కోడ్లు (Labour Codes). ప్రభుత్వం 29 పాత చట్టాలను కలిపి నాలుగు కోడ్లుగా (వేతనం, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఓఎస్హెచ్డబ్ల్యూసీ కోడ్) తెచ్చింది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) చేయడానికే అంటున్నా.. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు దీనిని కార్పొరేట్ అనుకూల చట్టంగా చూస్తున్నాయి.
ముఖ్యంగా, కొత్త ‘వేజ్ కోడ్’ ప్రకారం జీతం నిర్వచనం మారడం వల్ల, ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కలు మారిపోతాయి. దీని వల్ల కంపెనీలపై వేతన భారం 5% నుంచి 15% వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భారాన్ని కంపెనీలు చివరికి ఉద్యోగుల చేతికి వచ్చే జీతం తగ్గించడం ద్వారా భర్తీ చేస్తాయన్న భయం ఉంది. కార్మిక సంఘాలు ఈ చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఎంఎస్ఎంఈలపై కూడా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాకు ముందస్తు రాయితీలా?
రెండో కీలక అస్త్రం విదేశాంగ విధానం. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలు చివరి దశకు వచ్చాయి. ఒప్పందం పూర్తవకముందే.. భారత్ కొన్ని “ముందస్తు రాయితీలు” (Premature Concessions) ఇస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దీనికి ముఖ్య కారణం, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా భారతీయ ఉత్పత్తులపై 50% వరకు సుంకాలను (Tariffs) విధించడం. ఈ సుంకాల కారణంగా టెక్స్టైల్స్, జెమ్స్ వంటి రంగాల్లో ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోయారు.
ఈ సుంకాలు తొలగించుకోవడం కోసం.. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవడం, అమెరికా నుంచి భారీగా ఎల్పీజీ (LPG) కొనుగోలుకు అంగీకరించడం వంటి నిర్ణయాలు.. వాణిజ్య ఒప్పందం కోసం తీసుకున్న ‘రాజకీయ త్యాగాలు’ అని ప్రతిపక్షం విమర్శిస్తోంది. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి విదేశాంగ విధానంలో లొంగిపోతున్నారనేది ప్రధాన ఆరోపణ.
జాతీయ భద్రత, నేషనల్ హెరాల్డ్ ఎత్తుగడ!
మూడో అంశం: జాతీయ భద్రత (National Security) అంశాన్ని పాలకపక్షం రాజకీయాలకు వాడుకుంటోందనే విమర్శ. ఈ మూడు అస్త్రాలతో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్ చేస్తోంది.
అయితే, ప్రతిపక్షాల ఈ శాసనపరమైన విమర్శలను తగ్గించడానికి అధికారపక్షం కూడా ఓ ‘డైవర్షనరీ స్కాండల్’ను వాడుకుంటోందనేది విశ్లేషణ. అదే నేషనల్ హెరాల్డ్ కేసు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై ఇటీవల ఈ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యంగ్ ఇండియన్ (YI) కంపెనీ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను (సుమారు ₹2,000 కోట్ల విలువైనవి) కేవలం ₹50 లక్షలకు అక్రమంగా చేజిక్కించుకున్నారనేది ప్రధాన ఆరోపణ.
ప్రతిపక్షం కార్మిక చట్టాలపై విమర్శలు చేస్తున్న సమయంలోనే..ఈ నేషనల్ హెరాల్డ్ భూతం మళ్లీ తెరపైకి రావడం.. పాలకపక్షం వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్షం దీనిని రాజకీయ వేధింపుగా కొట్టిపారేస్తోంది.

