జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు 15 ఏళ్ల పొత్తు కూటమితోనే ఉంటుందని ప్రకటిస్తూ ఉండటం,రాబోయే రెండు ఎన్నికల వరకు తెలుగుదేశం , బీజేపీతో కూడిన ఈ కూటమి బలంగా కొనసాగాలని, తద్వారా రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం, అభివృద్ధి దక్కుతుందని ఆయన స్పష్టం చేస్తుండటం జనసైనికులలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి సిద్ధాంతాలపై నమ్మకంతో, వ్యక్తిగత కష్ట నష్టాలను భరించి నిలబడిన క్షేత్ర స్థాయి జనసైనికులు ఇప్పుడు కూటమి విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, లోకల్ పాలిటిక్స్ లో వారికి సరైన గుర్తింపు దక్కడం లేదని తెలుస్తోంది.
పొత్తులో ‘క్యాడర్’ పడుతున్న కష్టాలు:
- టీడీపీ ఆధిపత్యం: ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించినప్పటికీ, అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఎప్పటి నుంచో ఉంది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో, స్థానిక వ్యవహారాల్లో సహజంగానే టీడీపీ నాయకుల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇది జనసైనికులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.
- అవమానాలు, నిర్లక్ష్యం: కొన్ని ప్రాంతాలలో టీడీపీ నేతలు, వారి క్యాడర్… జనసైనికులను ‘పొత్తులో ఉన్న పార్టీ’ కార్యకర్తలుగా మాత్రమే చూస్తున్నారనే ఆవేదన ఉంది. తమను సమానంగా చూడకపోవడం, తమ సూచనలను పట్టించుకోకపోవడం వంటి అవమానకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
- పదవుల పంపకం: స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల పంపకంలో జనసేనకు న్యాయం జరగదేమో అనే భయం జనసైనికులను పట్టి పీడిస్తోంది. ఎక్కువ సీట్లు గెలిచిన టీడీపీ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, తమ నాయకుడి కోసం ఇన్నేళ్లు పోరాడిన శ్రమ వృథా అవుతుందని వారు కలత చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగా క్యాడర్ కి ఇస్తున్న సందేశమా..!?
పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై స్పష్టమైన అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘సేనతో సేనాని’ వంటి సమావేశాలలో, ఆయన కూటమిలోని మూడు పార్టీల క్యాడర్, నాయకులు తమ స్ధాయిలోనే గొడవలు పరిష్కరించుకోవాలని సూచించారు.
అంటే, తమ కష్టాలను అధిగమించి, స్థానిక నాయకుల ఆధిపత్యాన్ని ధైర్యంగా ప్రశ్నించే బాధ్యతను క్యాడర్‌కే అప్పగించినట్లు అయ్యింది.మరోవైపు, 15 ఏళ్ల పొత్తు ప్రకటన వెనుక పవన్ వ్యూహం.. తన క్యాడర్‌కు దీర్ఘకాలిక లక్ష్యాన్ని చూపించడమే. రాష్ట్రానికి స్థిరత్వం అవసరమని, స్వార్థం కంటే జన సంక్షేమమే ముఖ్యమని ఆయన సందేశమిస్తున్నారు.
కానీ, ఈ 15 ఏళ్ల పాటు సీఎం పదవిని త్యాగం చేస్తారా? అనే ప్రశ్న అభిమానుల్లో మిగిలింది. పవన్ కళ్యాణ్ “మరో 15 ఏళ్లు కూటమే” అని అన్నారు కానీ, “మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం” అని స్పష్టంగా చెప్పలేదు. రాబోయే ఎన్నికల్లో జనసేన బలం పెరిగితే, తమకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందనే ఆశను ఆయన పరోక్షంగా క్యాడర్‌లో నింపుతున్నారు.
అయితే..15 ఏళ్ల లక్ష్యం ఉన్నా..కింద స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం, గౌరవం లేకపోతే ఈ పొత్తు దీర్ఘకాలం మనగడ సాగించడం కష్టం. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి, క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలకు న్యాయం చేయగలిగితేనే.. జనసైనికుల త్యాగాలు, కష్టాలు వృథా కాకుండా ఉంటాయి. లేకపోతే, నిరాశ చెందిన క్యాడర్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.
—MB

