గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం మరోసారి రసాభాసగా మారింది. నగర అభివృద్ధి గురించి చర్చ జరగాల్సిన సభ కాస్తా.. ‘వందేమాతరం’ గీతంపై చెలరేగిన వివాదంతో రణరంగంగా మారిపోయింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం మొదలైన వెంటనే ఈ గందరగోళం మొదలైంది.
జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దానిని ఆలపించేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ సభ్యులు కోరారు. మేయర్ అందుకు అంగీకరించారు. అయితే, ప్రఖ్యాత కవి అందెశ్రీకి నివాళిగా జయజయహే తెలంగాణ గీతాన్ని కూడా పాడుదామని సూచించారు. ఈ ప్రతిపాదనను ఎంఐఎం (AIMIM) తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
అనంతరం, సభలో వందేమాతరం మరియు జయజయహే తెలంగాణ గీతాలాపన జరిగింది. ఈ సమయంలో చెత్తా బజార్ డివిజన్ కార్పొరేటర్ సోహెల్ సహా పలువురు మజ్లిస్ కార్పొరేటర్లు తమ సీట్లలో కూర్చునే ఉండిపోయారు. నిలబడకుండా నిరసన తెలిపారు.
ఇది చూసిన బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర గీతాలను అవమానించడం దారుణం అంటూ మండిపడ్డారు. “దేశంలో ఉండాలంటే వందేమాతరం గీతం పాడాల్సిందే” అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంఐఎం సభ్యులు కూడా ప్రతి నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట వరకు దారితీసింది.
సభ్యులు ఆగ్రహంతో కుర్చీల పైకి ఎక్కి ఆందోళన చేశారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మేయర్ విజయలక్ష్మి మార్షల్స్‌ను లోపలికి పిలిపించారు. “మనమేమైనా రౌడీలమా?” అంటూ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు శాంతించకపోవడంతో, చివరికి కౌన్సిల్ సమావేశం ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడింది.
హైదరాబాద్ నగర సమస్యల గురించి చర్చించకుండా, కేవలం రాజకీయ నినాదాలు, గొడవలతో సభ ముగియడంపై సాధారణ ప్రజానీకం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోంది.

