ఫ్రీ సినిమా, మీ డేటా ఖాళీ! రాజమౌళి,నాగార్జున సంచలన వ్యాఖ్యలు.!

“లోకంలో ఏదీ ఉచితంగా రాదు,” ఈ మాట అన్నది ఎవరో కాదు, మన జక్కన్న రాజమౌళి. ‘ఐబొమ్మ’ రవి అరెస్ట్ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు (చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు) హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మీడియా ముందు రాజమౌళి మాట్లాడిన మాటలు, ఉచితంగా సినిమాలు చూస్తున్న లక్షలాది మందికి షాక్ ఇచ్చాయి.

“ఐబొమ్మలో మీకు సినిమాలు ఫ్రీగా ఎలా వస్తున్నాయి? అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయడానికి డబ్బు ఎక్కడిది? మీరు ఆలోచించారా?” అంటూ రాజమౌళి సూటిగా ప్రశ్నించారు. “మీరు అక్కడ సినిమా చూస్తున్నప్పుడు, మీ పర్సనల్ డేటాను ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. మనకంటే ఎక్కువగా నష్టపోతున్నది మీరే,” అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

పోలీసులకే సవాల్.. ఫ్రాన్స్ నుండి అరెస్ట్ వరకు

కొంతకాలంగా ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ సోషల్ మీడియాలో పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి, చివరికి చట్టానికి చిక్కాడు. ఫ్రాన్స్, కరేబియన్ దీవుల నుండి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న రవి, ఇటీవల హైదరాబాద్ రాగానే సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు. ఇతని అరెస్ట్ వెనుక పెద్ద కథే నడిచింది. ‘ఐబొమ్మ’పై ఫిర్యాదులు రావడంతో, పోలీసులు నెలల తరబడి నిఘా పెట్టి ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.

సీపీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం, రవి కేవలం పైరసీ మాత్రమే చేయలేదు. ఇదొక మల్టీ-క్రైమ్ నెట్‌వర్క్.

  • 50 లక్షల మంది డేటా: ఐబొమ్మ యూజర్లయిన సుమారు 50 లక్షల మంది వ్యక్తిగత సమాచారం (ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్) రవి చేతిలో ఉంది. ఈ డేటాను అతను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టాడని పోలీసులు నిర్ధారించారు.
  • బెట్టింగ్ దందా: సినిమా లింక్‌ల ముసుగులో ‘One win’, ‘1xbet’ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోట్ చేశాడు. దీనివల్ల ప్రజలు వేల కోట్లు నష్టపోయారని అంచనా.
  • వేలకోట్ల నష్టం: ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టం అక్షరాలా వేల కోట్లు. రవి హార్డ్ డిస్క్‌లో ఏకంగా 21,000 సినిమాలు (పాతవి, కొత్తవి కలిపి) దొరికాయి.

నా కుటుంబంలోనే బాధితుడు: నాగార్జున

ఈ డేటా అమ్మకం ఎంత ప్రమాదకరమో నాగార్జున మాటలు రుజువు చేశాయి. “ఇలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల మా కుటుంబంలోనే ఒకరు ‘డిజిటల్ అరెస్ట్’ బారిన పడ్డారు. ఇది చాలా పెద్ద ట్రాప్,” అని నాగార్జున సంచలన విషయం బయటపెట్టారు. “ఉచితం” అనే ఆశతో వెబ్ సైట్లోకి వెళ్లిన ప్రేక్షకులు, తమ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అప్పగించినట్లే అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అడగకముందే అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అంటారు, అడగకుండానే అన్నీ లాగేసుకునే వాడిని దొంగ అంటారు. ఇక్కడ ‘ఐబొమ్మ’ రవి ఉచిత సినిమా పేరుతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలించాడు. చిరంజీవి అన్నట్లు, “వేల కుటుంబాల కష్టాన్ని ఒకడు దోచుకోవడం” మాత్రమే కాదు, లక్షల మంది యూజర్ల భద్రతను కూడా ప్రమాదంలో పడేశాడు.

Leave a comment