ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి X వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, మోసపోయిన రైతన్నలు ఏ క్షణమైనా చంద్రబాబు కాలర్ పట్టుకుని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“వీకెండ్ ట్రిప్పులు.. ఫారిన్ టూర్లేనా?” కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా, రైతుల బతుకులు మారలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు విదేశీ పర్యటనలు, వారాంతపు హైదరాబాద్ జల్సాలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతల కష్టాలపై లేదని ఎద్దేవా చేశారు. “రైతుల చొక్కాలు కూడా ఊడదీసేలా పాలన సాగిస్తూ.. మళ్లీ వారి కాలర్ ఎగరేసేలా చేస్తానని కల్లబొల్లి మాటలు చెబుతారా?” అంటూ జగన్ ఘాటుగా ప్రశ్నించారు.
అరచేతిలో వైకుంఠం.. ఎన్నికల సమయంలో “అన్నదాత సుఖీభవ” కింద ఏటా రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించారని జగన్ మండిపడ్డారు. రెండేళ్లకు రూ. 40,000 ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ. 10,000 విదిలించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి వంటి పంటల ధరలు పాతాళానికి పడిపోయినా ప్రభుత్వం ‘ధరల స్థిరీకరణ నిధి’ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా ఒక్క రూపాయి ఇన్-పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, పంటలు అమ్ముకోలేక రైతులు రోడ్లపైన పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కానీ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే చంద్రబాబును వదిలిపెట్టరని హెచ్చరించారు.

