జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి అయిన మాగంటి సునీత ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కేటీఆర్ స్వయంగా ప్రచార బాధ్యతలు మొత్తం తన భుజాలపై వేసుకుని, విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే, ఇంత చేసినా ‘కారు’కు ఓటమి తప్పలేదు. ఈ ఫలితం వెలువడిన వెంటనే, పార్టీ నుంచి సస్పెన్షన్‌లో ఉన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్ చేశారు.
“కర్మ హిట్స్ బ్యాక్ !!!” అంటూ ఆమె పెట్టిన పోస్ట్, సూటిగా కేటీఆర్‌ను ఉద్దేశించిందేనని రాజకీయ వర్గాలు బలంగా విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి, కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆమె బలంగా నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా, కవిత గురించి కేటీఆర్‌ను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ, “పార్టీ గీత దాటితే ఎవరికైనా శిక్ష తప్పదు” అని వ్యాఖ్యానించారు. సొంత సోదరుడి నుంచి ఈ సమాధానం ఊహించని కవిత, తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, కేటీఆర్ సర్వం తానై నడిపించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడాన్ని కవిత ‘కర్మ’ ఫలంగా అభివర్ణిస్తున్నారు. తనను పక్కన పెట్టినందుకు, ఇప్పుడు ఈ ఓటమి రూపంలో ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని ఆమె పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ఒక్క ట్వీట్‌తో బీఆర్ఎస్ కుటుంబంలోని విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.

