పవన్‌ సరికొత్త ప్లాన్: ఏపీ, తెలంగాణ లోకల్ పోల్స్‌పై ఫోకస్‌!

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్, పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయన నెక్స్ట్ టార్గెట్..రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు!

జనసేన స్థానిక సంస్థల ఎన్నికలు వ్యూహం చాలా పకడ్బందీగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా జనసేన తమ బలాన్ని పెంచుకోవాలని పవన్ కల్యాణ్ గట్టిగా నిర్ణయించారు. ఈ కీలక బాధ్యతలను ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సినీ నిర్మాత, సాఫ్ట్‌వేర్ నిపుణుడు రామ్ తాళ్లూరికి అప్పగించారు. ఆయనే సంస్థాగత వ్యవహారాలను మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే నడిపిస్తున్నారు.

నిజానికి, 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ పార్టీకి అపారమైన బలాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహాన్ని లోకల్ బాడీ ఎన్నికల వరకు కొనసాగించాలి అనేది పవన్‌ ఆలోచన. సంస్థాగత నిర్మాణంలో అనుభవం ఉన్న రామ్ తాళ్లూరిని రంగంలోకి దించడం వ్యూహాత్మక అడుగు.

తెలంగాణలో జనసేన పుంజుకోవడానికి సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి నాయకత్వ మార్పు దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇకపై కేవలం మద్దతు ఇవ్వడం కాదు, స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు అన్నింటిలోనూ ప్రత్యక్షంగా పోటీ చేయాలని జనసేన ప్లాన్ చేస్తోంది. “మాటలు కోటలు దాటుతాయి, చేతలు కంచె కూడా దాటవు” అని విమర్శకులు అంటుంటారు. అయితే, ప్రత్యక్ష పోటీ ఉంటేనే కేడర్ యాక్టివ్ అవుతుందని, పార్టీ భూస్థాయి నుంచి ఎదుగుతుందని అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు నాయకత్వాన్ని మార్చి కొత్త ఉత్సాహం తీసుకురాబోతున్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే, పార్టీ కార్యకలాపాలు అదే వేగంతో జరుగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బూత్ స్థాయిని పటిష్టం చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఉంది. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలతో కూటమి స్ఫూర్తికి ఎక్కడా భంగం కలగకూడదు. ఆ దిశగా జాగ్రత్త పడుతూనే, జనసేన తమ సొంత బలాన్ని పెంచే దిశగా వ్యూహ రచన జరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన భవిష్యత్తును మరింత బలంగా నిర్దేశిస్తాయని పార్టీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

Leave a comment