మంత్రి పదవిపై కోమటిరెడ్డి ఆశలు ఆవిరి – హైకమాండ్ ‘సైలెంట్ షాక్’

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ లేదా బెర్త్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు పరోక్షంగా  స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అదేంటంటే, దబాయించి, బెదరించి పార్టీలో పదవులు తెచ్చుకోవడం అంత తేలిక కాదని తన చేతల ద్వారా క్లియర్ కట్ గా చూపించింది.

మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ‘సామ, దాన, బేద, దండోపాయాలు’ అన్నింటినీ ఉపయోగించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తీవ్ర విమర్శలు, నిష్ఠూరాలూ చేశారు. ఒకే కుటుంబంలోని వారికి గతంలో పదవులు ఇచ్చిన సందర్భాలను ఉటంకిస్తూ, తనకిస్తే తప్పేమిటని నిలదీశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అందలం ఎక్కించారని పరోక్ష విమర్శలు కూడా చేశారు.

అయినా సరే, పార్టీ హైకమాండ్ ఆయన వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. గీత దాటి విమర్శలు చేసినా, కనీసం క్రమశిక్షణా కమిటీ ముందుకు కూడా పిలవలేదు, చర్యలు తీసుకోలేదు. అంటే, ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ అసలు లెక్క చేయలేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పింది.

తాజా చర్యలతో స్పష్టత

తాజాగా, రేవంత్ రెడ్డి తన కేబినెట్‌లోకి మహమ్మద్ అజారుద్దీన్‌ను తీసుకున్నారు. అంతేకాకుండా, కేబినెట్ బెర్త్ ఆశించిన మరో ఇద్దరు సీనియర్ నాయకులు ప్రేమ్‌సాగ‌ర్‌రావు, సుద‌ర్శ‌న్‌రెడ్డిలకు కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులను ఇచ్చి సంతృప్తి పరిచారు.

అయితే, మంత్రి పదవి కావాలి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రం హైకమాండ్ పూర్తిగా విస్మరించింది. ఈ నిర్ణయాలన్నీ హైకమాండ్ స్పష్టతతోనే తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజకీయ వర్గాల్లో చర్చ: పదవి కోసం హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో వ్యవహరిస్తే, ఫలితం ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో లేదా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదుపరి స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాలలో నెలకొంది.

Leave a comment