రాజమౌళి సర్​ప్రైజ్ ప్లాన్​ను పట్టపగలే బ్రేక్ చేసిన సూపర్ స్టార్.. ప్రియాంక, పృథ్వీరాజ్ కాస్టింగ్ లీక్!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ SSMB29 గురించి సోషల్ మీడియాలో నిన్న జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మరియు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్న విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లీక్ చేసి రాజమౌళికి షాకిచ్చారు.


విషయం ఏంటంటే…
దర్శక ధీరుడు రాజమౌళి నవంబర్ నెలలో తమ సినిమాకి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇస్తానని అభిమానులకు మాటిచ్చారు. నవంబర్ రాగానే మహేష్ బాబు.. రాజమౌళిని ఉద్దేశిస్తూ ‘నవంబర్ వచ్చేసింది’ అని ట్వీట్ చేశారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో తెలుగులో బదులిచ్చారు. “యస్.. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్..?” అని అడిగారు.


మహేష్ బాబు కౌంటర్‌ ఇస్తూ.. “మీరు ఎప్పుడూ తీయని మహాభారతానికి రివ్యూ తర్వాత, నవంబర్ అప్‌డేట్ ఇవ్వండి” అంటూ.. ప్రియాంక చోప్రా జనవరి నుంచీ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతోందంటూ.. ఆమె ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు.

ఈ లీక్​పై స్పందించిన ప్రియాంక చోప్రా.. ‘హలో హీరో! సెట్‌లో నేను నీతో పంచుకున్న రహస్యాలను బయట పెట్టేయమంటావా? నా మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా చేసేస్తా’ అంటూ మహేష్​కు సరదాగా వార్నింగ్ ఇచ్చింది.

దీంతో నిజం బయటపడటంతో.. రాజమౌళి వెంటనే రంగంలోకి దిగి.. ‘పిసి (ప్రియాంక చోప్రా) గురించి ఎందుకు రివీల్ చేశావ్ మహేష్.. సర్​ప్రైజ్ పాడు చేశావ్!’ అంటూ కోపం నటిస్తూ ట్వీట్ చేశారు.

అయితే ఇక్కడితో ఆగని మహేష్.. “సర్​ప్రైజ్​ అంటే.. పృథ్వీరాజ్ కూడా సర్​ప్రైజ్ ఏనా..?” అని అడగడంతో.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ సంభాషణలో జాయిన్ అయ్యారు. “సార్! నా హైదరాబాద్ వెకేషన్స్‌కి సాకులు చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇక మా ఫ్యామిలీకి నాపై అనుమానం వస్తుంది” అంటూ పృథ్వీరాజ్ ట్వీట్ చేశారు.

ఇలా తమ క్యాస్టింగ్‌ను లీక్ చేసిన మహేష్ బాబుపై రాజమౌళి.. ‘నువ్వు అంతా పాడుచేశావ్’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాజమౌళి అప్‌డేట్ ఇస్తానని ఒప్పుకున్నా, మహేష్‌కి శిక్షగా ఫస్ట్ లుక్ ఆలస్యం చేస్తానని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ఈ మొత్తం సరదా సంభాషణ వైరల్‌గా మారి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.

Leave a comment