రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మొదలైంది.. ఈసారి థ్రిల్లర్ తో!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో రాజ్ తరుణ్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్టుగా సాగుతున్న కెరీర్‌కు ఒక గట్టి కిక్ ఇచ్చేందుకు, ఈసారి ఒక కొత్త దర్శకుడితో, విభిన్నమైన కథను ఎంచుకున్నారు.

ఆ కొత్త చిత్రమే ‘టార్టాయిస్’. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌తో రిత్విక్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ, “ఇదొక కొత్తరకం స్క్రీన్‌ప్లేతో సాగే థ్రిల్లర్. రాజ్ తరుణ్ గారి కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య, అమృత చౌదరి పాత్రలు చాలా బలంగా ఉంటాయి,” అని తెలిపారు.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకాలపై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విడుదలైన మోషన్ పోస్టర్, ఒక తాబేలు చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథాంశాన్ని సూచిస్తోంది. “నిదానమే ప్రధానం” అన్నట్లు, రాజ్ తరుణ్ నెమ్మదిగా అయినా ఈ ‘టార్టాయిస్’ (తాబేలు)తో గట్టి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

Leave a comment