నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు రికార్డులు తిరగరాశాయి. ఇప్పుడు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అయితే రిలీజ్ కి కేవలం రెండు రోజులు ఉండగా, సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారట!
ఏఐ మాయాజాలం.. శివుడిగా అన్నగారు?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏఐ (Artificial Intelligence) టెక్నాలజీ హవా నడుస్తోంది. కల్కి 2898 ADలో కృష్ణుడు, విజయకాంత్ వంటి పాత్రలను ఏఐ ద్వారా రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో బోయపాటి శ్రీను కూడా ఒక సాహసం చేశారని టాక్.
‘అఖండ 2’ కథా నేపథ్యం అంతా శివుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే ఒక కీలకమైన సన్నివేశంలో సీనియర్ ఎన్టీఆర్ సాక్షాత్తు పరమశివుడి రూపంలో దర్శనమిస్తారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. ఈ వార్త విన్న నందమూరి అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్..?
గతంలో యమగోల, దానవీరశూరకర్ణ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ దేవుడి పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు బాలయ్య అఘోరగా వీరవిహారం చేస్తుంటే, తెరపై తండ్రి ఎన్టీఆర్ శివుడిగా కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే అవకాశముందని, ఇది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, థియేటర్లోనే ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
భారీ తారాగణం – టెక్నికల్ వండర్..!
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలి మల్హోత్రా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.
తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ట్రైలర్ లో గూస్బంప్స్ తెప్పించింది. డిసెంబర్ 4 సాయంత్రం నుండే ప్రీమియర్స్ పడనుండటంతో, ఈ సస్పెన్స్ కి త్వరలోనే తెరపడనుంది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ రికార్డుల సునామీ సృష్టించడం పక్కా.

