అసలైన పాన్ ఇండియా డెఫినిషన్: శేష్ స్టైల్ సూపర్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త ఒరవడి నడుస్తోంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా… ప్రతీదీ పాన్ ఇండియా అనిపించుకోవాలని చూస్తోంది. కథలో కంటెంట్ ఉన్నా లేకపోయినా, పక్క భాషల నటీనటులను లాక్కువచ్చి, కనీసం డబ్బింగ్ చేసేసి ‘పాన్ ఇండియా’ అని కలరింగ్ ఇస్తున్నారు. ఇలాంటి హడావుడి సమయంలో, యంగ్ హీరో అదివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

శేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘డకాయిట్’ (Dacoit). ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు షనీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శేష్ కేవలం డబ్బింగ్‌తో సరిపెట్టకుండా, సరికొత్త పద్ధతిలో రూపొందించాలని ఫిక్స్ అయ్యాడు. అదేంటంటే.. ‘డకాయిట్’ తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ వెర్షన్‌ను కూడా విడివిడిగా షూట్ చేయడం. అంటే, ఒకే కథను రెండు భాషలకు తగ్గట్టుగా రెండుసార్లు తెరకెక్కించడం అన్నమాట!

లాంగ్వేజ్ కాదు, ఎమోషన్ ముఖ్యం: శేష్ స్ట్రాటజీ

‘అదెందుకు? డబ్బు, టైమ్ వేస్ట్ కాదా?’ అని అనిపించవచ్చు. కానీ, దీని వెనుక అదివి శేష్‌కి బలమైన కారణం ఉంది. అతని దృష్టిలో భాష కేవలం ఒక మాధ్యమం కాదు, అది భావోద్వేగం. ఒక కథను డబ్ చేసినప్పుడు లేదా కేవలం అనువదించినప్పుడు, దానిలోని ‘ఎమోషనల్ అండర్‌కరెంట్’ (భావనలోని పట్టు) దెబ్బతింటుంది. స్క్రిప్టులోని సారాంశం, కథా ప్రవాహం.. ఆడియెన్స్‌కు సరిగ్గా కనెక్ట్ అవ్వవు. ఈ లాజిక్‌ను శేష్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే, సహజంగా ఉండే భావోద్వేగాల కోసం స్ట్రయిట్ లాంగ్వేజ్‌లో షూట్ చేయడానికే ఇష్టపడుతున్నాడు.

అయితే, ఈ విషయంలో శేష్ గత అనుభవం కూడా ఉంది. అతను రాసి, నటించిన ‘మేజర్’ (Major) సినిమా కూడా తెలుగు, హిందీ భాషల్లో బైలింగువల్‌గానే విడుదలైంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను ఆంధ్రా, నార్త్ ఆడియెన్స్‌కు ఇద్దరికీ నచ్చేలా చెప్పడంలో శేష్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఇప్పుడు ‘డకాయిట్’ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.

ఇక ఈ సినిమా కాస్టింగ్ కూడా బలమైంది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్ ఓ పవర్‌ఫుల్, హాస్యభరితమైన పోలీస్ పాత్రలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతీ ఫ్రేమ్, ప్రతీ ఎమోషన్ ప్రేక్షకుడికి నూటికి నూరు శాతం కనెక్ట్ కావాలన్న శేష్ ఆలోచన నిజమైన ‘పాన్ ఇండియా’ స్ఫూర్తిని చాటుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘డకాయిట్’తో శేష్ పాన్ ఇండియా సత్తా మరోసారి నిరూపితం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a comment