జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్ ప్రైవేట్ టీమ్స్‌తో నిఘా!

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ, అవినీతి రహిత పాలనపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు (21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు) అందరిపైనా ఆయన కఠినమైన అంతర్గత నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరిపాలనపై ప్రజల్లో చెడ్డ అభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా పార్టీ వర్గాల నుంచి వచ్చే సమాచారంపై మాత్రమే ఆధారపడకుండా, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రైవేట్ గ్రౌండ్ టీమ్స్‌ను నియమించారు. ఎందుకంటే, పార్టీలో గ్రూపులు, మొహమాటాల కారణంగా నిఖార్సైన సమాచారం తన దాకా రాకపోవచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే, ఈ టీమ్స్ క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలను, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్‌ను సేకరిస్తున్నాయి.

ముఖ్యంగా అక్రమ సెటిల్మెంట్లు, ఇసుక, గ్రావెల్ దందాలు, ఇతర అవినీతి కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలు, వారి పీఏలు లేదా అనుచరులు జోక్యం చేసుకుంటున్నారా అనే అంశంపై ఈ టీమ్స్ మానిటరింగ్ చేస్తున్నాయి. అంతేకాకుండా, అక్రమాలకు సంబంధించిన పక్కా ఆడియో, వీడియో ఆధారాలను కూడా పవన్ టీమ్స్ సేకరిస్తున్నాయి.

ఈ రహస్య నివేదికల ఆధారంగా ఇప్పటికే కొందరు శాసనసభ్యులకు పవన్ కల్యాణ్ నుంచి రెడ్ సిగ్నల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారంపై పవన్ స్వయంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ప్రభుత్వ పనుల్లో జోక్యం, సెటిల్‌మెంట్‌లతో పేరు తెచ్చుకోగా, పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఈ హెచ్చరికతో సదరు ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలు చేపట్టి, రేషన్ బియ్యం మాఫియాపై బహిరంగ హెచ్చరికలు కూడా జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Leave a comment