చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21న విడుదలైంది. క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే పాత ఫార్ములాను కంటిన్యూ చేస్తూ, శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయీ) కథను ఈసారి ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో, చైనా కుట్రలను జోడించి చూపించారు.ఎపిసోడ్‌ల నిడివి ఎక్కువై, కథనం నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
సాంకేతికంగా ఈ సిరీస్ అద్భుతంగా ఉన్నా, కథ మాత్రం పాత బాటలోనే నడిచిందని చాలామంది అభిప్రాయపడ్డారు. దేశీయ సంస్థలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు మధ్య జరిగే పోరాటాలు పదేపదే చూసినట్టుగా అనిపించాయి . నిజం చెప్పాలంటే, సస్పెన్స్, థ్రిల్ లేకపోవడం ఈ సీజన్‌కు మైనస్ పాయింట్‌గా మారింది.
కానీ, ఈ సీజన్‌కు ఒక ప్రధాన ఆకర్షణ ఉంది. అదే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కేమియో. రాజ్ అండ్ డీకే రూపొందించిన మరో సూపర్ హిట్ సిరీస్ ‘ఫర్జీ’లోని మైఖేల్ వేదనాయగం పాత్రను సేతుపతి ఇందులో పోషించారు.
‘ఫర్జీ’ యూనివర్స్ నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్’ యూనివర్స్‌లోకి మైఖేల్ రావడం ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌గా నిలిచింది. ఈ క్రాసోవర్ చూసిన నెటిజన్లు నిరాశ నుంచి బయటపడి, సేతుపతి ఎంట్రీని ఎంజాయ్ చేశారు.
ఇక, నటీనటుల విషయానికొస్తే, మనోజ్ బాజ్‌పాయీ తనదైన శైలిలో శ్రీకాంత్ తివారీ పాత్రలో జీవించారు. షరీబ్ హష్మీ (జేకే) నటన ఎప్పుడూ లేనంతగా ఆకట్టుకుంది.
కొత్త విలన్‌గా వచ్చిన జైదీప్ అహ్లావత్ (రుక్మా) నటన కూడా బాగున్నా, మనోజ్ బాజ్‌పాయీతో ఆయన ఫేసాఫ్ సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో పండలేదు. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సీజన్, నాలుగో సీజన్‌కు లైన్ వేస్తూ ముగిసింది.
ఫైనల్ గా… సామర్ధ్యం ఉన్నా సాగదీత ఎక్కువ అయ్యింది.!

