ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత సి. కళ్యాణ్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో ఎన్నో ఏళ్లుగా పైరసీతో కుదేలైన తెలుగు చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. విడుదలైన రోజే హెచ్‌డీ ప్రింట్‌లతో కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిన రవిని పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసులు చేసిన కృషిని సినీ పెద్దలు అభినందిస్తున్నారు. ఈ పరిణామం నేపథ్యంలోనే, చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఆగ్రహంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇమ్మడి రవి లాంటి వాళ్ళు ఈ భూమికి భారం. ఇలాంటి వారిని అసలు బ్రతకనివ్వకూడదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నూటొక్క జిల్లాల నిర్మాతగా పేరున్న కళ్యాణ్, తన కడుపు మంటను ఆపుకోలేక, “వాడిని ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలి” అని బహిరంగంగా డిమాండ్ చేశారు. పోలీసులకు వీలు కాకపోతే, ఆ రవిని తమ సినిమా వాళ్ల చేతుల్లో పెట్టాలని, తామే అతడిని ఎన్‌కౌంటర్ చేస్తామని చెప్పడం ఆయన ఆవేశాన్ని చూపించింది. ఇటువంటి కఠిన చర్యల ద్వారానే పైరసీ ఆలోచన ఇతరులకు రాకుండా భయం పుడుతుందని ఆయన వాదించారు. “శ్రమ దోపిడీకి తగిన శాస్తి” జరగాలని ఇండస్ట్రీ గట్టిగా కోరుకుంటోంది.

అయితే, ఇక్కడో విచిత్రమైన కోణం ఉంది. చిత్ర పరిశ్రమ మొత్తం రవికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంటే, సీనియర్ నటుడు శివాజీ మాత్రం వేరే విధంగా స్పందించారు. “రవి లాంటి తెలివైన హ్యాకింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు ప్రభుత్వాలకు కావాలి. అతడు పొట్టకూటి కోసం ఏదో తప్పు చేశాడు. అతని ప్రతిభను మంచి కోసం ఉపయోగించాలి” అని శివాజీ అన్నారు. “అంతా ఓ వైపు, ఇదో వైపు” అన్నట్టుగా, ఈ రెండు భిన్న వాదనలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

మరోవైపు, టికెట్ ధరలు పెంచడం వల్లే ప్రేక్షకులు పైరసీని ఆశ్రయిస్తున్నారని, నిర్మాతలు నాణ్యత కలిగిన సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్మాత చాదలవాడ శ్రీనివాస రావు లాంటి వారు అభిప్రాయపడటం ఈ సమస్యలోని మరో కోణాన్ని చూపించింది. మొత్తానికి, పైరసీపై ఈ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వ కృషిని సి. కళ్యాణ్ ప్రశంసించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ త్వరలో పోలీసు అధికారులను సత్కరించనుందని తెలిపారు.

Leave a comment